తెలంగాణ

తాగునీరు పొలాల పాలు

తాగునీరు పొలాల పాలు

. పంప్ ఆపరేటర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అశ్వాపురం సర్పంచ్ బానోతు సదర్ లాల్.

పయనించే సూర్యుడు, అక్టోబర్ 15,అశ్వాపురం: గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు ఎదురవుతున్న సమయంలో, ప్రజలకు సరఫరా చేయాల్సిన తాగునీరు వృథాగా వ్యవసాయ పొలాల్లోకి వెళ్లడంపై అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోతు సదర్ లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మంచికంటినగర్ సమీపంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును పరిశీలించిన సమయంలో, ట్యాంకు పూర్తిగా నిండినప్పటికీ పంపును రన్నింగ్‌లో ఉంచడం వల్ల విలువైన తాగునీరు వృథాగా సమీపంలోని వ్యవసాయ పొలాల్లోకి వెళ్తుండటాన్ని సర్పంచ్ సదర్ లాల్ స్వయంగా గమనించారు. ఈ విషయంపై స్థానికులను ఆరా తీయగా, పంప్ ఆపరేటర్ ప్రవీణ్ వ్యవహారంపై పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. అంతేకాకుండా, సమీపంలోని రైతులకు నీటిని అందించే విధంగా పంప్ ఆపరేటర్ వ్యవహరిస్తున్నార నే ఆరోపణలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయని, ఈ అంశంపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాలని సర్పంచ్ కోరారు.ఇప్పటికే అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సమస్యను పలుమార్లు మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ, ప్రజలకు అవసరమైన స్థాయిలో నీటి సరఫరా జరగడం లేదని పేర్కొన్నారు. ఒకవైపు ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు అందుబాటులో ఉన్న నీరు వృథా కావడం బాధాకరమన్నారు.ప్రజలకు అందించాల్సిన తాగునీటిని నిర్లక్ష్యంగా వృథా చేయడం సహించరాని విషయమని, నీటి ప్రతి చుక్కను ప్రజల అవసరాలకు వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ ఘటనపై మిషన్ భగీరథ డీఈ అధికారులు తక్షణమే స్పందించి, సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత పంప్ ఆపరేటర్‌పై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సర్పంచ్ బానోతు సదర్ లాల్ డిమాండ్ చేశారు. భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ పెంచి, అశ్వాపురం గ్రామ ప్రజలకు సక్రమంగా తాగునీరు అందేలా చూడాలని కోరారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS