పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 30ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ:_ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కిసాన్ మేళా మరియు వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమంలో ప్రభుత్వ విప్,ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి, రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు,యంత్ర పరికరాలు,సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు పంటల సాగు, నేల ఆరోగ్యం,ఎరువుల వినియోగం,ఆధునిక సాంకేతికతపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతు క్షేమమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందని తెలిపారు. రైతులు పొలాల్లో సాయిల్ టెస్టులు చేయించుకుని,నేల స్వభావానికి అనుగుణంగా ఎరువులు వినియోగించాలని,శాస్త్రవేత్తలను సంప్రదించి నూతన పద్ధతులను అవలంబించాలని సూచించారు. ఆరోగ్యకరమైన, పర్యావరణహిత వ్యవసాయం కోసం ప్రకృతి వ్యవసాయం వైపు దృష్టి సారించాలని, యూరియా,రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని కోరారు.వ్యవసాయ యంత్రాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తోందని,డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సాగునీటి విషయంలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నా మని, సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.అన్నదాత సుఖీభవ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అమలు చేస్తున్నామని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కిసాన్ మేళా ద్వారా రైతులు తమ సందేహాలను శాస్త్రవేత్తలు, అధికారులతో నేరుగా చర్చించి నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుందని, ఆధునిక వ్యవసాయం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.