17 ఏళ్లలో రాజకీయ శిఖరాన్ని అధిరోహించిన రేవంత్ – జెడ్పీటీసీ నుంచి సీఎం దాకా అద్భుత యాత్ర
పయనించే సూర్యుడు న్యూస్ :ఎనుముల రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా కింది స్థాయి నుంచి అత్యున్నత పదవికి ఎదిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరించే ఆయన ఓ సాధారణ జెడ్పీటీసీగా మొదలైన రాజకీయ ప్రస్థానం.. అనతి కాలంలోనే సీఎం పీఠమెక్కి ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారు. పడి లేచిన కెరటంలా రాష్ట్రంలో ఆదరణ తగ్గుతున్న క్రమంలో కాంగ్రెస్‌లో చేరి ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి నవంబర్ 8వ లేదీన తన 56వ పుట్టిన రోజు చేసుకుంటున్నారు. తెలంగాణలో రెడ్డి వర్గానికి చెందిన ఎనుముల రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న జన్మించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లిలో నర్సింహా రెడ్డి, రామచంద్రమ్మలకు జన్మించారు. ఏవీ కాలేజ్ నుంచి కామర్స్‌లో బీఏ చదివిన ఆయన ఏబీవీపీలో విద్యార్థి నాయకుడిగా పని చేసిన రేవంత్.. ఓయూలో విద్యార్థిగా రాజకీయాల్లో తొలి అడుగులు వేశారు. ఆ తర్వాత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సోదరుడు కుమార్తె గీతతో వివాహం జరిగింది. వీరికి వైమిష జన్మించింది.
కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా.. 2006లో మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా స్వతంత్రంగా బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత 2007లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ లభించకపోవడంతో ఒంటరిగా పోటీ చేసి గెలిచారు. ఇక, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు మీద అపై అభిమానంతో 2008లో టీడీపీలో చేరారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మరోసారి గెలుపొందారు. ఈ సమయంలో ఆయన టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, అసెంబ్లీలో టీడీపీ సభాపక్ష నేతగా వ్యవహరించారు. తెలంగాణలో టీడీపీకి ఆదరణ తగ్గడంతో 2017లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేారారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, ఆ తర్వాత 2021లో పీసీసీ ప్రెసిడెంట్‌గా నియమితు లయ్యారు. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2019లో ముల్యాజ్ గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి పార్టీని రాష్ట్రంలో విజయపథంలో నడిపించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదిలా ఉండగా, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇందులో భాగంగానే సాయంత్రం రేవంత్ రెడ్డి దంపతులు ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొననున్నారు.