PS Telugu News
Epaper

“దేశ ప్రగతికి వందే భారత్ ప్రతీక” – నాలుగు కొత్త రైళ్లు ప్రారంభించిన ప్రధాని మోదీ

📅 08 Nov 2025 ⏱️ 12:44 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తన నియోజకవర్గం వారణాసి నుంచి నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించారు.భారతీయ రైల్వే చరిత్రలో వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ వంటి రైళ్లు కొత్త తరానికి పునాది వేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు.బనారస్ రైల్వేస్టేషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి రైళ్లను ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేవ్ దీపావళిని చూసిన అసాధారణ ఉత్సవాలను ఆయన ప్రస్తావించారు.ఈ రోజు కూడా శుభప్రదమైన సందర్భం అని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు దేశ అభివృద్ధకి తన వనరులను మెరుగుపరచుకునే లక్ష్యంగా చేపట్టిందన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాలను వందే భారత్ నెట్‌వర్క్ ద్వారా అనుసంధానించనున్నారు. దేశ సంస్కృతి, విశ్వాసం, అభివృద్ధి ప్రయాణాల సమ్మేళనాన్ని సూచిస్తుందన్నారు. వారసత్వ నగరాలను జాతీయ పురోగతికి చిహ్నాలుగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగుగా ప్రధాని అభివర్ణించారు. ఈ నాలుగు కొత్త రైళ్లతో దేశంలో ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్ల సంఖ్య 160కి పైగా పెరిగిందన్నారు.ఈ రైళ్ల ప్రారంభం సందర్భంగా వారణాసి ప్రజలకు, భారత పౌరులకు ప్రధాని అభినందనలు తెలిపారు. వందే భారత్‌ రైళ్లను చూసి విదేశీ ప్రయాణికులు కూడా ఆశ్చర్యపోతున్నారన్నారు. గత 11 ఏళ్లల్లో ఉత్తరప్రదేశ్‌లో అభివృద్ధి కార్యక్రమాలు యాత్రకు కొత్త స్థాయిని పెంచాయని ప్రధాని అన్నారు. గతేడాది 11 కోట్ల మంది భక్తులు బాబా విశ్వనాథుడి దర్శనం కోసం వారణాసిని సందర్శించారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం తర్వాత 6 కోట్ల మందికి పైగా ప్రజలు రామలల్లా ఆలయాన్ని సందర్శించారన్నారు. ఈ కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు బనారస్-ఖజురహో, లక్నో-సహారన్‌పూర్, ఫిరోజ్‌పూర్-ఢిల్లీ,  ఎర్నాకుళం-బెంగళూరు మార్గాల్లో నడవనున్నాయి. బనారస్-ఖజురహో వందే భారత్ రైలు ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లతో పోలిస్తే దాదాపు 2 గంటల 40 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. బనారస్–ఖజురహో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, ఖజురహోతో సహా దేశంలోని అత్యంత గౌరవనీయమైన మత, సాంస్కృతిక గమ్యస్థానాలను కలుపుతుంది. ఇక, లక్నో-సహారన్‌పూర్ వందే భారత్ దాదాపు 7 గంటల 45 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. అంతకుముందు ప్రయాణానికి దాదాపు 1 గంట ఆదా చేస్తుంది. లక్నో-సహారన్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో, సీతాపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, బిజ్నోర్, సహారన్‌పూర్ నుంచి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరనుంది. అలాగే ఫిరోజ్‌పూర్-ఢిల్లీ వందే భారత్ ఈ మార్గంలో 6 గంటల 40 నిమిషాల్లో ప్రయాణించనుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ, ఫిరోజ్‌పూర్, బఠిండా, పటియాలాతో సహా పంజాబ్‌లోని కీలక నగరాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది.అదే విధంగా ఎర్నాకుళం-బెంగళూరు వందే భారత్ ప్రయాణ సమయాన్ని 2 గంటల కంటే ఎక్కువ తగ్గిస్తుంది. మొత్తం 8 గంటల 40 నిమిషాల్లో ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రధాన ఐటీ, వాణిజ్య కేంద్రాలను కలుపుతుంది.  ఈ మార్గంతో కేరళ, తమిళనాడు, కర్ణాటక మధ్య ఎక్కువ ఆర్థిక కార్యకలాపాలు, పర్యాటకాన్ని మేలు చేకూరనుంది.  ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితర ప్రముఖులు పాల్గొనగా.. కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్, కేంద్ర మంత్రులు సురేష్ గోపి, జార్జ్ కురియన్, రవ్‌నీత్ సింగ్ బిట్టు, ఇతర ప్రముఖులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

Scroll to Top