పయనించే సూర్యుడు, అక్టోబర్ 01, అశ్వాపురం: అశ్వాపురం గ్రామంలో ఆయుర్వేదిక్ హాస్పిటల్ సెంటర్ వద్ద ఓ హెచ్ ఎస్ ఆర్ మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అశ్వాపురం గ్రామపంచాయతీ హెడ్‌క్వార్టర్ పంచాయతీ కావడంతో గ్రామంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, వ్యాపార సంస్థలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర సంస్థలు అధికంగా ఉన్నాయని సర్పంచ్ తెలిపారు. వీటితో పాటు గ్రామ జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి వినియోగం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.గతంలో గ్రామంలోని మూడు నీటి ట్యాంకులకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా అయ్యేదని, ప్రస్తుతం లో-ప్రెజర్ కారణంగా కేవలం రెండు ట్యాంకులకు మాత్రమే నీరు అందుతుండటంతో అవసరాలకు సరిపడా నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఈ సమస్యపై గతంలో పలుమార్లు మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడం బాధాకరమన్నారు. పదిహేను రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా పునరుద్ధరించకపోవడంపై సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.హెడ్‌క్వార్టర్ పంచాయతీగా ఉన్న అశ్వాపురంలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూడు ట్యాంకులకు పూర్తిస్థాయిలో నీరు అందేలా లో-ప్రెజర్ సమస్యను వెంటనే పరిష్కరించాలని సర్పంచ్ డిమాండ్ చేశారు.ఇకనైనా అధికారులు సమస్యపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై రోడ్డుపైకి వచ్చి ధర్నా చేపట్టే పరిస్థితి ఏర్పడుతుందని సర్పంచ్ హెచ్చరించారు. ప్రజల తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిగణించి అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు