తెలంగాణ

రెండు కీలక రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి వినతి

రెండు కీలక రహదారుల నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కి వినతి

వినతి పత్రం సమర్పించిన అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్*

పయనించే సూర్యుడు, అక్టోబర్ 07,అశ్వాపురం: అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల నిత్య రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న రెండు ముఖ్యమైన రహదారులకు మెటల్ రోడ్లు ఏర్పాటు చేయాలని కోరుతూ అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ పినపాక శాసనసభ సభ్యులు పాయం వెంకటేశ్వర్లు కి వినతిపత్రం అందజేశారు.అశ్వాపురంలోని రైతు వేదిక నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ అభియాన్ వారోత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా సర్పంచ్ ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆర్ అండ్ బి రోడ్డు నుండి మంచికంటినగర్ వరకు సుమారు ఐదు వందల మీటర్ల మేర, అలాగే కాలవ బజార్‌లోని రాజేష్ ఇంటి నుండి పీహెచ్‌సీ వరకు సుమారు ఐదు వందల మీటర్ల మేర మెటల్ రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ రెండు మార్గాలు నిత్యం ప్రజల రాకపోకలతో రద్దీగా ఉండే ముఖ్యమైన పబ్లిక్ ప్రదేశాలకు అనుసంధానమై ఉన్నాయని, రహదారులు సరిగా లేకపోవడంతో స్థానిక ప్రజలతో పాటు పీహెచ్‌సీకి వైద్యం కోసం వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేక చొరవ తీసుకొని రెండు రహదారులకు అవసరమైన నిధులు మంజూరు చేయించి, పనులను త్వరితగతిన చేపట్టేలా సంబంధిత అధికారులకు సూచించాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో ముత్యాలరావు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS