పయనించే సూర్యుడు అక్టోబర్ 4( సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రేషన్ మాఫియా రాజ్యం.. అధికారుల మౌనం వెనుక మర్మమేమిటి?పేదల బియ్యం పక్కదారి.. గోదాముల నుంచే అక్రమ మళ్లింపులు?వరుస కథనాలు వెలువడుతున్నా స్పందన శూన్యం.. విజిలెన్స్, రెవెన్యూ శాఖల పర్యవేక్షణ ఏదీ?సూళ్లూరుపేట మండలంలో రేషన్ బియ్యం అక్రమ మళ్లింపుల వ్యవహారం రోజురోజుకూ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యంపై అక్రమార్కుల కన్ను పడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా. ప్రతి నెలా రేషన్ డీలర్లకు పూర్తిస్థాయిలో బియ్యం చేరకముందే మధ్యవర్తుల గోదాముల నుంచే పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకం ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం అక్రమ మళ్లింపులకు గురవుతోందనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఎక్కడా కనిపించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు కథనాలు వెలువడినా అధికార యంత్రాంగంలో కనీస చలనం లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రతి నెలా ఇదే తరహా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నా వాటిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో అధికారులు వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై DTని ప్రశ్నించినప్పుడు తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. మరి రేషన్ బియ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లుతోంది? డీలర్లకు చేరాల్సిన బియ్యం మధ్యలోనే మాయమవుతోందనే ఆరోపణలపై బాధ్యత ఎవరిది? గోదాముల నుంచి జరుగుతున్నట్లు చెబుతున్న ఈ అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారా? నిర్వహిస్తే అక్రమాలు వెలుగులోకి ఎందుకు రావడం లేదు? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. వరుసగా ఆరోపణలు వస్తున్నా అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పేదల హక్కులకు భంగం కలిగించే అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా విజిలెన్స్, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రేషన్ గోదాములు, సరఫరా రికార్డులు, డీలర్లకు చేరిన బియ్యం వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. బియ్యం పంపిణీ నుంచి డీలర్లకు చేరే వరకు ప్రతి దశలో పారదర్శకతను నిర్ధారించాలి. ఆరోపణలు నిజమని తేలితే మధ్యవర్తులు, సంబంధిత బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. రేషన్ మాఫియా ఉందనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా అధికారులు మౌనం వీడి స్పందిస్తారా? లేక పేదల బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఇలాగే కొనసాగుతాయా? అన్నది వేచి చూడాల్సి ఉంది.