పయనించే సూర్యుడు అక్టోబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
అక్టోబర్ 10న కిమ్స్ ఆధ్వర్యంలో భారీ కార్యక్రమం, 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది భాగస్వామ్యం, ప్రతి మూడు నెలలకొకసారి స్వచ్ఛత కార్యక్రమాలు. పరిశుభ్రమైన పరిసరాలతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ఈ నెల 10న నిర్వహించనున్న స్వచ్ఛ అమలాపురం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా ప్రతినిధులు పూర్తిస్థాయిలో సహకరించాలని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ కులపతి, కిమ్స్ వైద్య కళాశాల ఫౌండర్ చైర్మన్ కెవివి సత్యనారాయణరాజు (చైతన్యరాజు) పిలుపునిచ్చారు. ఆదివారం కిమ్స్ వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీలో స్వచ్ఛ అమలాపురం సన్నాహక సభ చైతన్యరాజు అధ్యక్షతన జరిగింది. అక్టోబర్ 10 శనివారం ఉదయం 7 గంటల నుంచి ఇంటింటికీ స్వచ్ఛ అమలాపురం కార్యక్రమం ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ భారీ కార్యక్రమంలో కిమ్స్ కు చెందిన 3,600 మంది విద్యార్థులు, సిబ్బంది 36 బస్సుల ద్వారా అమలాపురంలోని పలు వార్డులకు చేరుకుని పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, ఎంపి గంటి హరీష్ మాధుర్ బాలయోగి, ప్రజాప్రతినిధులు, వాకర్స్ సంఘాలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. పరిశుభ్రతను ఒక్కరోజుకే పరిమితం చేయకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, ప్రతి మూడు నెలలకు ఒకసారి పట్టణంలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తామని, నేటి పరిశుభ్రతే రేపటి ఆరోగ్యం అనే సందేశంతో త్వరలో కామనగరువు పంచాయతీ, ముమ్మిడివరం నగర పంచాయతీలలో కూడా విస్తరిస్తామని తెలిపారు.