పయనించే సూర్యుడు అక్టోబర్అక్టోబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి ఆర్థికలేమితో బాధపడుతూ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటు అరుదైన ఘనతను దక్కించుకున్న అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఉండ్రాజవరపు భవ్యశ్రీ జ్యోత్స్నను జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సోమవారం ఆమె ఇంటికి వెళ్లి అభినందించి సత్కరించారు.ఈనెల రెండవ తేదీన మహాత్మా గాంధీ,లాల్ బహుదూర్ శాస్త్రి జయంతులను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని పార్లమెంటు భవనంలో నిర్వహించిన నో యువర్ లీడర్ కార్యక్రమంలో పాల్గొనే అరుదైన ఘనతను రాష్ట్రం నుంచి ఒకే ఒక్క విద్యార్థినిగా భవ్య శ్రీ దక్కించుకుంది. న్యూఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన భవ్యశ్రీ కి గూడాల గరువు ప్రాంతవాసులు ఘనంగా స్వాగతం పలికారు.భవ్య శ్రీ ఇంటికి చేరుకుందన్న సమాచారంతో జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాసరావు విద్యార్థిని ఇంటికి చేరుకున్నారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇంట్లో ఆ కుటుంబం ఉండడాన్ని గుర్తించి ఆయన చలించిపోయారు.తల్లిదండ్రులు శ్రీనివాస్, అనంతలక్ష్మిలు కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. దాంతో భవ్య శ్రీ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం కాకినాడలో చదువుతుంది.వారి పరిస్థితిని గుర్తించిన డిటిఓ శ్రీనివాసరావు భవ్యశ్రీ ఉన్నత చదువుల కోసం ఏ అవసరం ఉన్నా తనను సంప్రదించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రధాని మోడీతో సహా ఎందరో రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన నో యువర్ లీడర్ కార్యక్రమంలో పాల్గొన్న భవ్యశ్రీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భవ్యశ్రీ తో పాటు ఆమె తల్లిదండ్రులకు దుశ్శాలువాలు కప్పి సత్కరించారు. కార్య క్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుబ్బల నాగ సత్యనారాయణ,ఎస్ఎంసీ మాజీ చైర్మన్ ఎలిపే ముత్యాలబాబు తదితరులు పాల్గొన్నారు