పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్

June 19, 2026 | సినిమా వార్తలు

:పయనించే సూర్యుడు జూన్20: ఉట్కూర్ :నారాయణపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి సీ.హెచ్. ప్రియాంక ఉపాధ్యాయురాలిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. లెక్కలను సులభంగా ఎలా చేయాలో బోర్డుపై చేసి చూపించారు. ఉట్కూర్ మండలంలోని తిప్రస్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల గ్రంథాలయాన్ని, మధ్యాహ్న భోజనానికి వినియోగిస్తున్న నిత్యావసర సరుకులను పరిశీలించారు. మెనూ పాటించకపోవడంపై వంట ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలోని 2వ, 4వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులకు బోర్డుపై లెక్కలు చేసి చూపించారు.ఉట్కూర్ మండల కేంద్రంలోని పాఠశాలల సందర్శన ఉట్కూర్ మండల కేంద్రంలోని శ్రీరామ్‌నగర్ వీధిలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ ప్రియాంక సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ తప్పనిసరిగా పాటించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.బడి బాట కార్యక్రమం ద్వారా ఎంతమంది విద్యార్థులను నమోదు చేశారో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్‌నగర్ పాఠశాలలో బియ్యాన్ని పరిశీలించిన కలెక్టర్, బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించి, సంబంధిత బియ్యం బస్తాలను తిరిగి పంపించి కొత్త బియ్యం బస్తాలను తెప్పించుకోవాలని పాఠశాల హెచ్‌ఎంకు ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి గదిని సందర్శించి విద్యార్థినులతో మాట్లాడారు. ఉపాధ్యాయురాలు బోధిస్తున్న ఇంగ్లీష్ పాఠం బోధనా విధానాన్ని పరిశీలించారు. అర్థం కాని అంశాలను ఉపాధ్యాయులను అడిగి మళ్లీ తెలుసుకోవాలని విద్యార్థినులకు సూచించారు. పదో తరగతి పరీక్షల్లో అందరూ 550 మార్కులకు పైగా సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు.తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి కంప్యూటర్ గదిని పరిశీలించారు. పదో తరగతి గదిలో హిందీ పాఠం బోధన విధానాన్ని పరిశీలించి, విద్యార్థులను హిందీలో ప్రశ్నలు అడిగి వారి ప్రతిభను పరీక్షించారు. పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి, అందుబాటులో ఉన్న మరుగుదొడ్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.పాఠశాల ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో అదనపు మరుగుదొడ్లు, తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎంపీడీవోకు సూచించారు. పక్కనే ఉన్న ఉర్దూ మీడియం తరగతులను కూడా పరిశీలించారు. ఉర్దూ మీడియం తరగతి గదులు శిథిలావస్థకు చేరాయని గ్రామ సర్పంచ్ శ్రీమతి రేణుకా భరత్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, అదనపు గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంపీవో బాలాజీ, ఉప సర్పంచ్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper