ప్రజా దర్బార్లో 39 వినతులు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్
ప్రజల సమస్యలకు ప్రాధాన్యం… ప్రతి అర్జీకి పరిష్కారమే లక్ష్యం
పయనించే సూర్యుడు ఆగస్టు 31 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ప్రజల కష్టాలు, సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపటానికి వేదికగా ప్రజా దర్బార్ ఉపయోగపడుతుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సోమవారం రామచంద్రపురంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మొత్తం 39 అర్జీలు అందాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు, విద్యుత్ సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన వినతులను ప్రజలు సమర్పించారు.ప్రతి అర్జీని మంత్రి సుభాష్ స్వయంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి వద్దకే ప్రభుత్వం చేరువ కావాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. ప్రజల కష్టాలు, అవసరాలను తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ వేదికగా నిలుస్తోందని, ప్రతి వినతిని బాధ్యతగా స్వీకరించి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అర్జీదారులు పాల్గొన్నారు