ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రయోగాత్మక విజ్ఞానాన్ని అందించేందుకు ‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్’ ప్రారంభం

August 31, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు ఆగస్టు 31 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విజ్ఞానశాస్త్రాన్ని ప్రయోగాత్మకంగా, ఆసక్తికరంగా నేర్పించాలనే లక్ష్యంతో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ‘సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ (స్లో )’ కార్యక్రమాన్ని బుర్గులలో ఘనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమం ద్వారా ఫరూఖ్‌నగర్ మండలంలోని 13 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలకు మొబైల్ సైన్స్ ల్యాబ్ వాహనం చేరుకుని, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని సైన్స్ అంశాలను ప్రత్యక్ష ప్రయోగాల ద్వారా అర్థం చేసుకునే అవకాశం కల్పించనుంది. ఈ వాహనం ప్రతిరోజూ ఒక పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థులకు వివిధ సైన్స్ ప్రయోగాలను స్వయంగా నిర్వహించేలా, చేసి నేర్చుకునే (లెర్నింగ్ బై డూయింగ్ ) విధానాన్ని ప్రోత్సహిస్తుంది.సైన్స్ ప్రయోగాలతో పాటు, విద్యార్థులకు క్లిష్టమైన శాస్త్రీయ భావనలను సులభంగా అర్థం చేసుకునేలా వర్చువల్ రియాలిటీ ( వి ఆర్ ) సాంకేతికతను కూడా ఈ కార్యక్రమంలో నియోగించనున్నారు. తద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆధునిక సాంకేతికతతో కూడిన, నాణ్యమైన శాస్త్ర విద్యను వారి పాఠశాలల వద్దకే అందించనున్నారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సైన్స్ అధికారి వై. శ్రీనివాస్ రావు, ఫరూఖ్‌నగర్ మండల విద్యాధికారి మనోహర్, యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ డా. వెంకట్ రెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయు లు జనార్ధన్, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రాజెక్టు మేనేజర్ అరుణ్, బుర్గుల ఉప సర్పంచ్ శివలీల మరియు వార్డు సభ్యులు, బుర్గుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవికుమార్ మరియు ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రీతి బాల, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా అతిథులు సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రయోగాత్మక విద్యను అందించడం ద్వారా వారిలో శాస్త్రీయ ఆలోచనా విధానం, పరిశీలనా నైపుణ్యాలు మరియు సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.గ్రామీణ విద్యార్థులకు ‘సైన్స్‌ను చదవడం మాత్రమే కాకుండా, స్వయంగా చేసి తెలుసుకునే అవకాశం’ కల్పించడమే ఎస్ ఎల్ ఓ డబ్లు కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper