సూళ్లూరుపేట ప్రజలకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చిన సూళ్లూరుపేట సిఐ
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట తడ మండలాలలో ఆధ్యాత్మిక శోభతో అలరారే వినాయక చవితి పండుగను సూళ్ళూరుపేట, తడ ప్రాంత ప్రజలందరూ కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పిలుపునిచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట సబ్ డివిజన్ డీఎస్పీ జి. చెంచుబాబు మార్గదర్శకత్వంలో పరిసర ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ఉత్సవాల నిర్వహణపై విగ్రహ కమిటీ సభ్యులకు పలు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి మండపం వద్ద విగ్రహాల రక్షణ బాధ్యతను పూర్తిస్థాయిలో కమిటీ సభ్యులే చూసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా చిన్నపాటి గొడవలు తలెత్తినా లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగినా నిర్వాహకులపైనే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేలు, అధిక ధ్వని ఇచ్చే సౌండ్ సిస్టమ్ల వినియోగానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి లేదన్నారు. పట్టణాల్లో ఎక్కడా అల్లర్లు జరగకుండా, రాకపోకలకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా ముమ్మర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.సూళ్ళూరుపేట, తడ ప్రాంతాలు ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతాలు కావడంతో, ఉపాధి నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్థానికులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పట్టణంలో గానీ, తడ సరిహద్దుల్లో గానీ కొత్త వ్యక్తులు తిరుగుతూ అనుమానాస్పదంగా అనిపిస్తే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాజానికి వినాశకరంగా మారిన గంజాయి రవాణా లేదా అమ్మకాలపై సమాచారం అందించిన వారి పేర్లను, వివరాలను పూర్తి రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.మన పోలీస్ – మన ఊరు అనే భావనతో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.ముఖ్యంగా యువతను ఉద్దేశించి సీఐ ఎం.మురళీకృష్ట మాట్లాడుతూ.. ఇది పిల్లలు, పెద్దలతో కలిసి ఆనందంగా జరుపుకునే కుటుంబ పండుగ అని, మద్యం మత్తులో ఊగడం లేదా గంజాయి తాగి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనాలపై అతివేగంతో వెళ్లడం, సైలెన్సర్లతో విపరీతమైన శబ్దాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నా సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చాలా సీరియస్గా చర్యలు ఉంటాయని సీఐ ఎం.మురళీకృష్ణ హెచ్చరించారు.