లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ భూసేకరణకు రూ.587 కోట్లు కేటాయింపు శుభపరిణామం
షాద్‌నగర్ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరే దిశగా ముందడుగు
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కృషి అభినందనీయం
షాద్‌నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్
( పయనించే సూర్యుడు జూన్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.587 కోట్ల నిధులను కేటాయించడం శుభపరిణామమని షాద్‌నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అని తెలిపారు. ప్రాజెక్టు సాధన కోసం ఎన్నో సంవత్సరాలుగా ఉద్యమాలు, వినతిపత్రాలు, ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఆశించిన పురోగతి కనిపించలేదన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాజెక్టుకు అవసరమైన నిధుల సాధన కోసం నిరంతరం కృషి చేయడంతో భూసేకరణకు రూ.587 కోట్ల నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు భూసేకరణకు నిధులు కేటాయించడం ద్వారా షాద్‌నగర్ ప్రాంత ప్రజల ఆశలకు కొత్త ఊపిరి లభించిందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌లకు షాద్‌నగర్ తాలూకా జేఏసీ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ తాలూకా జేఏసీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, జేఏసీ కన్వీనర్ నక్క బాల్‌రాజ్ యాదవ్, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం తాలూకా కోఆర్డినేటర్ జాంగారి రవి, జేఏసీ ట్రెజరర్ గోర్ల రాము, ఉద్యమకారుడు మల్లేష్ తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు..