మాగనూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఎంపీ డీకే అరుణ పర్యటన…నూతన కమిటీ హాల్‌కు నిధులు మంజూరు చేస్తామని హామీ …
:పయనించే సూర్యుడు జూన్ 12/మాగనూర్: మాగనూరు మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ గురువారం సందర్శించారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలు,కోనేరు, భక్తుల సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో డీకే అరుణమ్మకు శాలువా, పూలమాలతో ఘన సన్మానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ సభ్యులు ఆలయ చరిత్ర, బ్రహ్మోత్సవాల విశేషాలు, ప్రస్తుతం ఉన్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ హాల్‌కు హామీ భక్తుల మనవి మేరకు స్పందించిన ఎంపీ డీకే అరుణమ్మ మాట్లాడుతూ, ఆలయంలో నూతన కమిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే తన ఎంపీ నిధుల నుండి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి ఈ ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కల్యాణ మండపం, కోనేరు అభివృద్ధి, కాటేజీల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.