చిన్నారి సాయి సహస్ర కృషి ఫలించింది
– అనాధ బాలుడు ఛత్రపతికి పాఠశాలలో అధికారిక ప్రవేశం”
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లీ ప్రాథమిక పాఠశాలలో అనాధ బాలుడు ఛత్రపతికి అధికారికంగా ప్రవేశం కల్పించి విద్యాభ్యాసం ప్రారంభించారు.గత వారం చిన్నారి సాయి సహస్ర జిల్లా కలెక్టర్కు చేసిన విజ్ఞప్తికి స్పందించిన జిల్లా కలెక్టర్ శ్రీ భవేష్ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. వారి చొరవతో ఛత్రపతికి ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మాట్లాడుతూ ఛత్రపతికి ఇతర విద్యార్థులతో సమానంగా ప్రభుత్వం అందించే ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం మరియు నాణ్యమైన విద్య అందజేస్తామని తెలిపారు.చిన్నారి సాయి సహస్ర ఈ రోజు పాఠశాలను సందర్శించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ఛత్రపతిని ప్రత్యేకంగా ప్రోత్సహించి చదువులో రాణించేలా చూడాలని కోరారు. విద్య మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలదని పేర్కొంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిన్ననాటి జీవితాన్ని ఉదాహరణగా గుర్తు చేశారు. తీవ్రమైన పేదరికంలో, అనేక కష్టాల మధ్య చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించిన అంబేద్కర్ జీవితం ప్రతి విద్యార్థికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.ఈ సందర్భంగా ఛత్రపతికి స్కూల్ బ్యాగ్, పలక, స్లేట్, పెన్సిల్ బాక్స్ తదితర విద్యా సామగ్రిని చిన్నారి సాయి సహస్ర అందజేశారు.తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి బాలుడి విద్యాభ్యాసానికి సహకరించిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు జర్నలిస్టులకు చిన్నారి సాయి సహస్ర కృతజ్ఞతలు తెలిపారు.