సూళ్ళూరుపేట పట్టణాల్లో ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసుల ఉక్కుపాదం 20 బైక్‌లు సీజ్

పయనించే సూర్యుడు మే12 (సూళ్లూరుపేట నియోజవర్గం రిపోర్టర్ దాసు)సూళ్ళూరుపేట తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు నాయుడుపేట డిఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. మురళీకృష్ణ పర్యవేక్షణలో పట్టణంలో సోమవారం భారీ తనిఖీలు చేపట్టారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన 20 మోటార్ సైకిళ్లను సీజ్ చేసినట్లు ఎస్సై అజయ్ కుమార్ వెల్లడించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో యువత అతివేగంగా, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ పాదచారులను, ముఖ్యంగా వృద్ధులను భయాందోళనకు గురిచేస్తున్నారన్న ఫిర్యాదులపై పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సై అజయ్ కుమార్ మాట్లాడుతూ బైక్‌లకు మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చి శబ్ద కాలుష్యం కలిగిస్తే భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా, మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఒకే బైక్‌పై ముగ్గురు ప్రయాణించే ట్రిపుల్ రైడింగ్ సంస్కృతిని అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు
రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు తీసుకుంటున్న ఈ చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని హితవు పలికారు పోలీసుల ఈ కఠిన వైఖరి పట్టణంలో చర్చనీయాంశమైనప్పటికీ, సామాన్యుల భద్రత దృష్ట్యా ఇలాంటి చర్యలు అవసరమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు