ఎల్ నినో ముప్పుపై రైతులు అప్రమత్తంగా ఉండాలి: ఏఈఓ అంబదాస్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: ఝరి (బి) గ్రామంలో ఎల్ నినో, పంట సంజీవనిపై రైతులకు అవగాహన సదస్సు సాగులో మార్పులు చేసుకోవాలి; ఫామ్ పాండ్స్ (పంట కుంటలు) నిర్మించుకోవాలి.తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం లోమారుతున్న వాతావరణ పరిస్థితులు, ‘ఎల్ నినో’ ముప్పుపై రైతాంగం ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలని తానూర్ మండల వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అంబదాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని ఝరి (బి) గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో, సర్పంచ్ కమల భాయి బొడ్డోళ్ల బాబన్న అధ్యక్షతన రైతులకు ‘ఎల్ నినో వాతావరణ మార్పులు – వ్యవసాయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సదస్సులో ఏఈఓ అంబదాస్ ముఖ్య వక్తగా హాజరై రైతులకు పలు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు సకాలంలో పడకపోవడం, సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడం మరియు ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నారు.ఫామ్ పాండ్స్ (పంట కుంటల) ప్రాధాన్యత:వర్షాభావ పరిస్థితులను తట్టుకోవడానికి ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల్లో ఫామ్ పాండ్స్ (పంట కుంటలు) నిర్మించుకోవాలని ఈ సందర్భంగా ఏఈఓ రైతులకు అవగాహన కల్పించారు. వర్షం పడినప్పుడు కురిసిన ప్రతి చుక్కనూ ఈ కుంటల్లో భద్రపరుచుకోవడం ద్వారా, భవిష్యత్తులో వర్షాలు లేని సమయంలో పంట ఎండిపోకుండా రక్షించుకోవచ్చని (జీవనగ్రాసం అందించవచ్చని) వివరించారు.ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి:ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ నీరు అవసరమయ్యే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు రైతులు మొగ్గు చూపాలని ఆయన కోరారు. ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగులు వంటి చిరుధాన్యాలు, పెసర, మినుము, కంది వంటి పప్పుధాన్యాల సాగు ఎంతో లాభదాయకమని వివరించారు.
ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జాదవ్ ధన్సింగ్ వార్డ్ సభ్యులు బొడ్డోళ శంకర్ గ్రామస్తులు తది తరులు పాల్గొన్నారు.