భిక్షాటనతో వచ్చిన ఆదాయంతో అన్నదానం
*భక్తుల ప్రశంసలు అందుకుంటున్న ఇద్దరు సాధువులు*
పయనించే సూర్యుడు జూలై 25: (ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ) డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రమైన కుండలేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడగా, భక్తుల శివనామ స్మరణలతో క్షేత్రం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాకారం వెలుపల గత రెండేళ్లుగా నివసిస్తున్న ఇద్దరు సాధు బిక్షువులు శ్రీను, జోగయ్యలు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు. భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచిపెట్టి ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున భక్తులకు అన్న సమారాధన నిర్వహించడం వారి ప్రత్యేకతగా నిలుస్తోంది. స్వార్థం లేకుండా, ఎలాంటి ప్రచారం కోరకుండా సేవాభావంతో వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో వేసవి కాలంలో ఆలయానికి వచ్చే భక్తులకు దాహార్తిని తీర్చేందుకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేసిన ఈ సాధువులు, గత ఏడాది కూడా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఏడాది తొలి ఏకాదశి సందర్భంగా మరోసారి పెద్ద ఎత్తున అన్న సమారాధన చేపట్టి, ఆలయానికి విచ్చేసిన భక్తులకు ప్రసాద భోజనాన్ని అందించారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ వక్తలు మాట్లాడుతూ, “అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నదానం అన్ని దానాల్లో గొప్పది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అంటే భగవంతునికి సేవ చేసినట్లే. భక్తులందరూ అన్న సమారాధనలో పాల్గొని దైవానుగ్రహం పొందాలి” అని పిలుపునిచ్చారు. ఇటీవల బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల అనంతరం కుండలేశ్వర క్షేత్రానికి భక్తుల రాక గణనీయంగా పెరిగిందని స్థానికులు తెలిపారు. ఆ కాలం నుంచే ఈ ఇద్దరు సాధువులు క్షేత్రంలోనే ఉంటూ భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. కుడలేశ్వర క్షేత్రంతో పాటు ద్రాక్షారామం, శ్రీశైలం, కోటిపల్లి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో కూడా ప్రతి సంవత్సరం ఒక రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ సేవను విస్తరిస్తున్నారని వెల్లడించారు. సాధువుల జీవన విధానం కూడా భక్తులను ఆకట్టుకుంటోంది. భిక్షాటన ద్వారానే జీవనం సాగిస్తూ, అదే ఆదాయంతో సమాజానికి తిరిగి సేవ చేయడం అరుదైన విషయం అని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. తమ అవసరాల కంటే ఇతరుల ఆకలిని తీర్చడానికే ప్రాధాన్యం ఇస్తూ వారు చేస్తున్న సేవ నిజమైన త్యాగానికి నిదర్శనమని కొనియాడారు. వ్యాసమహర్షి వంటి మహనీయులు కూడా భిక్షాటన ద్వారానే జీవనం సాగించారని, భిక్షతో వచ్చిన ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి స్వీకరించేవారని వక్తలు గుర్తు చేశారు. అదే ఆదర్శాన్ని అనుసరిస్తూ ఈ సాధువులు భిక్షాటన ద్వారా వచ్చిన ధనంతో అన్నదానం చేయడం సమాజానికి గొప్ప సందేశమని పేర్కొన్నారు. అన్నదానంలో పాల్గొన్న భక్తులు సాధువుల సేవా భావాన్ని హర్షిస్తూ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నేటి కాలంలో స్వార్థరహిత సేవలు అరుదుగా కనిపిస్తున్నాయని, భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని సమాజ సేవకు వినియోగించడం నిజంగా అభినందనీయమని కొనియాడారు.