ఆంధ్రప్రదేశ్

కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి శోభ – సరస్వతీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రి శోభ – సరస్వతీ అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారు

ఆరవ రోజు మూలా నక్షత్రం, శుక్రవారం పర్వదినాన భక్తులతో కిటకిటలాడిన ఆలయం –

జనం న్యూస్, అక్టోబర్ 17, ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: కాట్రేనికోన మండలానికి ప్రసిద్ధి చెందిన కాట్రేనికోన గ్రామ దేవత, శక్తి స్వరూపిణి అయిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు శుక్రవారం, మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లని వస్త్రాలు, వీణ ధరించి, చదువుల తల్లిగా దర్శనమిచ్చిన అమ్మవారిని చూసి భక్తులు పులకించిపోయారు. ఈ సందర్భంగా ఆలయం విద్యుత్ దీపాలతో, పూలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భక్తుడు కుడిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేయగా, కొండి వెంకట సూర్యనారాయణమూర్తి, గ్రంధి నీలా రావు ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాద వితరణ ఘనంగా నిర్వహించారు. విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ఈ సరస్వతీ అలంకరణ పూజలో అధిక సంఖ్యలో విద్యార్థినీ, విద్యార్థులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శరన్నవరాత్రుల్లో సరస్వతీ అలంకరణ రోజున అమ్మవారిని దర్శించుకుంటే విద్య, జ్ఞానం, విజయం చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాలను ఆలయ కమిటీ, గ్రామస్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఫోటో క్యాప్షన్: సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న కాట్రేనికోన మావుళ్ళమ్మ తల్లి

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS