పయనించే సూర్యుడుD.12.11.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలోదళారులకు ధాన్యం విక్రయించిన రైతులకు సైతం రూ.500 బోనస్ అందించాలి రైతుల సమస్యలపై భీంగల్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన బీజేపీ నాయకులు బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు అరే రవీందర్ డిమాండ్ భీంగల్, గురువారం:
రైతులు కష్టపడి పంటలు పండిస్తేనే దేశానికి ఆహార భద్రత, రాష్ట్రానికి ఆర్థిక భద్రత సాధ్యమవుతుందని, అలాంటి రైతులను ప్రభుత్వ శాఖలే ఇబ్బందులకు గురిచేయడం అత్యంత దురదృష్టకరమని బీజేపీ భీంగల్ మండల అధ్యక్షులు అరే రవీందర్ అన్నారు.భీంగల్ మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న అటవీ భూముల సమస్యను పరిష్కరించాలని, సన్నవడ్లకు గిట్టుబాటు ధర కల్పించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ గురువారం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో భీంగల్ తహసీల్దార్ కిరణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరే రవీందర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.అటవీ శాఖ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదు!భీంగల్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు గత 40 నుంచి 50 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూముల విషయంలో అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేస్తూ, ఇకపై ఆ భూముల్లోకి రావద్దని, అవి అటవీ శాఖకు సంబంధించిన భూములని చెబుతూ రైతులను భయాందోళనలకు గురిచేస్తున్నారని అన్నారు.తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్న భూముల్లోకి రైతులను రానివ్వక పోవడం, పంటలు కోతకు వచ్చిన సమయంలో హార్వెస్టర్, ట్రాక్టర్ యజమానులను సైతం బెదిరిస్తూ పంటల కోతకు సహకరించకుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.రైతులకు భూములకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించాలి తప్ప, అధికార బలంతో రైతులను వేధించి వారి జీవనోపాధిని దెబ్బతీయకూడదని స్పష్టం చేశారు.ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి రైతులకు ఇబ్బందులు కలిగించకుండా అటవీ శాఖ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా రైతుల సమస్యపై స్పందించాలని కోరారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ ప్రాంతానికి చెందిన నాయకుడిగా చొరవ తీసుకొని రైతులకు న్యాయం జరిగేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.3,500 ధర కల్పించాలి!రాష్ట్ర ప్రభుత్వం ఏడు రకాల సన్నవడ్ల సాగును ప్రోత్సహిస్తూ, సన్నవడ్లు పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో రైతులు ప్రభుత్వ హామీపై నమ్మకంతో సన్నవడ్ల సాగు చేపట్టారని తెలిపారు.అయితే ప్రస్తుతం కొందరు దళారులు, రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి రైతులకు సరైన ధర అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. గతంలో క్వింటాల్ సన్నవడ్లకు రూ.3,000కు పైగా ధర చెల్లించిన వ్యాపారులు, ప్రస్తుతం రైతుల అవసరాలను ఆసరాగా చేసుకొని ధరలను తగ్గిస్తూ రైతులను నష్టాలకు గురిచేస్తున్నారని అన్నారు.మరోవైపు భీంగల్ మండలంలో ఇప్పటివరకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు గత్యంతరం లేక దళారులకు తక్కువ ధరకు ధాన్యం విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి సన్నవడ్లకు క్వింటాల్‌కు కనీసం రూ.3,500 ధర కల్పించాలని, రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.దళారులకు అమ్ముకున్న రైతులకు కూడా రూ.500 బోనస్ ఇవ్వాలి!ప్రభుత్వం ప్రకటించిన రూ.500 బోనస్ విషయంలో కూడా రైతులకు అన్యాయం జరగకూడదని అరే రవీందర్ అన్నారు.ప్రభుత్వం సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం, ధాన్యం కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల కొంతమంది రైతులు తమ అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు సన్నవడ్లు విక్రయించుకున్నారని తెలిపారు.వ్యవసాయ శాఖ వద్ద ప్రతి రైతు సాగు వివరాలు, పంట నమోదు వివరాలు, సాగు చేసిన వరి రకాల సమాచారం అందుబాటులో ఉన్నందున వాటిని ప్రామాణికంగా తీసుకొని ధాన్యం దళారులకు విక్రయించిన రైతులను కూడా గుర్తించాలని కోరారు.ప్రభుత్వం ప్రకటించిన హామీ మేరకు అర్హులైన రైతులందరికీ, ధాన్యం ఎక్కడ విక్రయించినప్పటికీ, క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందించాలని డిమాండ్ చేశారు.రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదు!రైతుల భూములకు భద్రత కల్పించడం, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అరే రవీందర్ స్పష్టం చేశారు.అటవీ భూముల సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని, సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.3,500 ధర కల్పించాలని, దళారులకు ధాన్యం విక్రయించిన రైతులకు సైతం రూ.500 బోనస్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రైతులకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని, ప్రభుత్వం స్పందించక పోతే రైతులతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తోట గంగాధర్, ఉపాధ్యక్షుడు తక్కూరి అంజయ్య, కొట్టాల మోహన్, మండల ఉపాధ్యక్షుడు ఈర్ల మహేందర్, రజినీకాంత్, యువ మోర్చా మండల అధ్యక్షుడు ప్రేమ్ చంద్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు లింబాద్రి, ఉపాధ్యక్షుడు రమావత్ వెంకటేష్, మండల నాయకులు రాజు కుమార్, మధు, లింబాద్రి నాయక్, ఉప కుప్కల్ సర్పంచ్ రాజేష్, పిప్రి లింబాద్రి, మల్లెల రమేష్, సుంకరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.