పయ నించే సూర్యుడు నవంబర్ 20ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం: ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలు, నమ్మకం, ఆశీస్సులే తనకు నిజమైన అమూల్యమైన సంపదని అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గొల్లపల్లి అమూల్య అన్నారు. మామిడికుదురు జడ్పీటీసీగా అత్యధిక మెజారిటీతో ఎన్నికైన తనకు జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం రావడం జీవితంలో మరిచిపోలేని రోజని ఆమె భావోద్వేగంగా పేర్కొన్నారు. ఒక దళిత మహిళగా తనపై నమ్మకం ఉంచి ఈ స్థాయికి తీసుకొచ్చిన కూటమి నాయకులకు, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన మామిడికుదురు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. విద్యావంతురాలిగా ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని, పదవి గౌరవంతో పాటు మరింత బాధ్యతను తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు ప్రజాప్రతినిధులందరి సహకారం, సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన జడ్పీ చైర్పర్సన్ అమూల్యకు మంత్రి వాసంశెట్టి సుభాష్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి, ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గన్నవరం నియోజవర్గం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ఇంచార్జ్ మోకా ఆనంద్ సాగర్ ఎమ్మెల్యేలు, ఎంపీ, కూటమి నాయకులు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.