పయనించే సూర్యుడు న్యూస్ | : వివాహేతర సంబంధాలు, కుటుంబ కలహాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయో తెలిపే ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటుచేసుకుంది. ప్రియురాలితో కలిసి కారులో మోమోలు తింటున్న భర్తను భార్య పట్టుకోవడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలో భర్త కారు బోనెట్‌పై భార్య వేలాడుతున్నప్పటికీ వాహనాన్ని ఆపకుండా సుమారు 100 మీటర్ల దూరం తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోహియా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీరామ్ కాలనీలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
వైరల్ వీడియో, పోలీసుల వివరాల ప్రకారం.. మయాంక్ అనే వ్యక్తి తన ప్రియురాలు మహితో కలిసి కారులో మోమోలు తింటున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న అతడి భార్య సునీత అక్కడికి చేరుకుని భర్తను, మరో మహిళను ప్రశ్నించింది. దీంతో మయాంక్ కారు డోర్లు లాక్ చేసి అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. భర్తను అడ్డుకునేందుకు సునీత కారు ముందు నిలబడి బోనెట్‌ను పట్టుకోగా, మయాంక్ వాహనాన్ని ముందుకు నడిపినట్లు తెలుస్తోంది. దీంతో సునీత కారు బోనెట్‌పై వేలాడుతూ సహాయం కోసం కేకలు వేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ దృశ్యాలను గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే స్పందించి కారును వెంబడించి అడ్డుకున్నట్లు సమాచారం. అనంతరం సునీతను బోనెట్‌పై నుంచి కిందకు దించారు. ఈ ఘటనపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తన భర్త తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడని, కట్నం వేధింపులకు పాల్పడ్డాడని, మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపించింది.
ఫిర్యాదు ఆధారంగా లోహియా నగర్ పోలీసులు కేసు నమోదు చేసి మయాంక్‌తో పాటు మహిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనలో ఉపయోగించిన కారును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న ఘటన, ఇరువర్గాల ఆరోపణలపై దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.