పయనించే సూర్యుడు న్యూస్:- రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కేవలం రూ.20 కచోరీ తినేందుకు ఆగిన ఓ వ్యాపారికి భారీ షాక్ తగిలింది. అతడు తినే పనిలో ఉండగా, దొంగలు రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల్లోకి వెళితే.. జైపూర్‌లోని నహర్‌గఢ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో చంపాలాల్ అనే వ్యాపారి స్కూటర్‌పై వచ్చి కచోరీ తినేందుకు ఆగాడు. రూ.20 లక్షల నగదు ఉన్న బ్యాగును స్కూటర్ ముందు ఉంచాడు. అదే సమయంలో మరో స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడి పక్కన ఆగారు. వెనుక కూర్చున్న వ్యక్తి వేగంగా నగదు బ్యాగును తీసుకుని సహచరుడితో కలిసి అక్కడి నుంచి పారిపోయాడు.
బ్యాగు చోరీకి గురైన విషయాన్ని గుర్తించిన చంపాలాల్ వెంటనే దొంగల వెంట పరుగులు తీశాడు. స్థానికులు కూడా వారిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, నిందితులు స్కూటర్‌పై వేగంగా పారిపోవడంతో తప్పించుకున్నారు. ఈ చోరీ జరిగిన తీరు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
బాధితుడి ఫిర్యాదు మేరకు నహర్‌గఢ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు హెల్మెట్లు ధరించి ఉండటంతో వారి గుర్తింపు కష్టంగా మారింది. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కేవలం కొన్ని క్షణాల్లో రూ.20 లక్షలు చోరీకి గురవడంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.