పయనించే సూర్యుడు,అక్టోబర్2,ముమ్మిడివరం ప్రతినిధి,గ్రంధి నానాజీ:_బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజలంతా సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు.రామచంద్రపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.దేశ భవిష్యత్తు నేటి చిన్నారులు,యువత చేతుల్లోనే ఉందని,చదువుకోవాల్సిన వయసులో పిల్లలు కూలి పనులు చేస్తూ బంగారు భవిష్యత్తును కోల్పోవడం బాధాకరమన్నారు.ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన రాములు అనే బాలుడు ఆహారం కోసం బాండెడ్ లేబర్‌గా అవస్థలు పడుతున్న ఘటనను చూసి చలించిపోయానని చెప్పారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామని తెలిపారు.బాల కార్మికులు ఎక్కడైనా పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.బాల్యం నుంచే వెట్టి చాకిరీలో చిక్కుకున్న పిల్లలు విద్యకు దూరమై సామాజిక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని,ప్రతి చిన్నారికి విద్య అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో భాగంగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ బుల్లి రాణి,అసిస్టెంట్ కమిషనర్ టి.నాగలక్ష్మి,లేబర్ అధికారులు మనోజ్,సుధా మాధవి,శ్వేతా ప్రజ్ఞ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి ఆలమూరు,తాళ్లపాలెం తదితర ప్రాంతాల్లోని ఇటుక బట్టీల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను పనిలో పెట్టుకున్న ముగ్గురు యజమానులపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ నిరంతర తనిఖీలు నిర్వహిస్తోందని,చిన్నారుల హక్కుల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.