పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ పోలీస్ స్టేషన్లో
భీంగల్: పోలీసుల వేధింపులు తాళలేక ఓ చిరు హోటల్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. భీంగల్ బస్టాండ్‌లో హోటల్ నిర్వహిస్తున్న పొలాస సుధాకర్‌ను లేట్‌నైట్ వరకు హోటల్ నడుపుతున్నారంటూ పోలీసులు పలుమార్లు ప్రశ్నించి జరిమానాలు విధించినట్లు ఆరోపించారు.ఇప్పటికే తనపై మూడుసార్లు ఫైన్ వేసినట్లు సుధాకర్ తెలిపారు. తాజాగా జరిమానా విధించిన పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేయాలని, కోర్టుకు వెళ్లి ఫైన్ కట్టి రావాలని ఆదేశించినట్లు చెప్పారు.తాను చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇతర దుకాణాలు కూడా తెరిచి ఉన్నప్పటికీ వారిని ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు.ఈ క్రమంలో సోమవారం ఉదయం సుమారు 10 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్ ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.అయితే ఘటనపై పోలీసులు అధికారికంగా ఏమి చెప్పారన్నది తెలియాల్సి ఉంది. బాధితుడి ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేసి, వాస్తవ పరిస్థితులను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.