తెలంగాణ

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన నీటి డిమాండ్.. అశ్వాపురంలో గేట్ వాల్వ్‌ల ఏర్పాటుకు చర్యలు

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన నీటి డిమాండ్.. అశ్వాపురంలో గేట్ వాల్వ్‌ల ఏర్పాటుకు చర్యలు

*.ఆయుర్వేదిక్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌ను పరిశీలించిన మిషన్ భగీరథ అధికారులు*

పయనించే సూర్యుడు, అక్టోబర్ 08, అశ్వాపురం: ఆయుర్వేదిక్ ఆసుపత్రి వద్ద ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌కు మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా అందకపోవడంపై గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ చేసిన ఫిర్యాదు మేరకు గురువారం మిషన్ భగీరథ డీఈ, ఏఈ మరియు సిబ్బంది బృందం ట్యాంక్‌ను పరిశీలించింది.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా అన్ని గ్రామపంచాయతీల్లో నీటి వినియోగం, డిమాండ్ గణనీయంగా పెరిగిందని తెలిపారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఒకేసారి అధిక మోతాదులో నీటిని పంపింగ్ చేసి సరఫరా చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు.అశ్వాపురం హెడ్‌క్వార్టర్ మేజర్ గ్రామపంచాయతీ కావడంతో ఇక్కడ నీటి అవసరం మరింత అధికంగా ఉంటుందని సర్పంచ్ సదర్ లాల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయుర్వేదిక్ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్‌కు అవసరమైన స్థాయిలో నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.నీటి సరఫరాను సమర్థవంతంగా నియంత్రించేందుకు గేట్ వాల్వ్‌లు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మిషన్ భగీరథ అధికారులు సూచించారు. దీనిపై గ్రామపంచాయతీ సానుకూలంగా స్పందించి, గేట్ వాల్వ్‌ల ఏర్పాటు కోసం అవసరమైన చర్యలు చేపడతామని సర్పంచ్ సదర్ లాల్ తెలిపారు.ప్రస్తుత ఎల్‌నినో ప్రభావం, పెరిగిన ఉష్ణోగ్రతలు, అధికమైన నీటి డిమాండ్ నేపథ్యంలో అశ్వాపురం గ్రామపంచాయతీకి నిరంతర, సమర్థవంతమైన నీటి సరఫరా అందించేందుకు మిషన్ భగీరథ శాఖతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డీఈ సలీం, ఏఈ నితిన్, సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శి యాకూబ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS