పయనించే సూర్యుడు న్యూస్: అక్టోబర్ 2 – తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎర్రదొడ్డి భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రెడ్డి సంఘం నాయకులు ఆయనకు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ రెడ్డి సంఘం అధ్యక్షులు బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నల్ల సంజీవ రెడ్డి, జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొట్టం మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలోని ఆర్థికంగా వెనుకబడిన పేద రెడ్డి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తానని ఆయన తెలిపారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అర్హులైన వారికి అవగాహన కల్పించడం, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు అంశంపై కృషి చేయడం, విదేశీ విద్యకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవడం, అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అవగాహన కల్పించడం వంటి అంశాలపై సంఘం ద్వారా నిరంతరం కృషి చేస్తానన్నారు.పేద రెడ్డి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు, తెలంగాణ రెడ్డి సంఘం ఐక్యత, బలోపేతం, అభివృద్ధి కోసం సంఘం నాయకత్వంతో సమన్వయంతో పనిచేస్తానని తెలిపారు.రాష్ట్ర కార్యదర్శిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, సంఘం లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.