పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 2 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి కెపిహెచ్‌బి కాలనీ తొలి వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపకులు, తొలి దశ మరియు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ స్నేహ వేదిక అధ్యక్షులు కక్కెర్ల మధు గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేపట్టారు.తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను వారు బతికి ఉన్నప్పుడే ప్రభుత్వం గుర్తించి, వారికి తగిన గౌరవం, గుర్తింపు, స్థానం కల్పించడంతో పాటు తగిన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ “తెలంగాణ ఉద్యమకారుల కోసం మనమంతా ఒక్కటై నిలుద్దాం” అనే నినాదంతో ఈరోజు కూకట్‌పల్లి కెపిహెచ్‌బి రోడ్ నెంబర్ వన్ లోని గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు.ఈ నిరాహార దీక్షకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు వసంత్‌నగర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు గురు ప్రసాద్ తో కలిసి హాజరై తెలంగాణ ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ నుంచి మలిదశ వరకు అనేక మంది ఉద్యమకారులు తమ జీవితాలను, కుటుంబాలను పక్కన పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారని అన్నారు. వారి త్యాగాలు, పోరాటాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని, ఉద్యమకారులను కేవలం కార్యక్రమాల సందర్భంగా స్మరించుకోవడం కాకుండా వారు జీవించి ఉన్నప్పుడే వారి సేవలను గుర్తించి తగిన గౌరవం కల్పించాలని అన్నారు.ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, గౌరవం, సంక్షేమ పథకాలు మరియు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని వడ్డేపల్లి రాజేశ్వరరావు డిమాండ్ చేశారు. తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన ప్రజాస్వామ్య పద్ధతిలో తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.తెలంగాణ ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం వెంటనే స్పందించి, వారితో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు.