కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత కరువు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఆగస్టు 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. తాజా గైడ్‌లైన్స్‌లో బీడీ కార్మికుల ప్రస్తావన కరువు 2014 నుంచి ఎదురుచూపులే.. బీడీ కార్మికులందరికీ పింఛన్ మంజూరు చేయాలి: సీఐటీయూ డిమాండ్బొమ్మెన సురేష్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు జీవన భృతి, పింఛన్ అందించాలని, ఆన్‌లైన్ దరఖాస్తుల విధానాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 12న కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్మల్ జిల్లా సీఐటీయూ కమిటీ పిలుపునిచ్చింది.కార్మికుల జీవితాల్లో ఆశల దీపాలు వెలగడం లేదని, ఎన్నికల సమయంలో పాలకులు ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారుతున్నాయని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకంలో కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు నిర్ణయించి, ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఒంటరి మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఫైలేరియా, డయాలసిస్ బాధితుల నుంచి మాత్రమే నూతన పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారని తెలిపారు. అయితే బీడీ కార్మికులకు మాత్రం అవకాశం కల్పించకపోవడం అన్యాయమని అన్నారు.జిల్లాలో లక్షన్నరకు పైగా బీడీ కార్మికులు నిర్మల్ జిల్లాలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు లక్షన్నరకు పైగా ఉన్నారని తెలిపారు. వీరిలో బీడీలు చుట్టే మహిళలతో పాటు పరిశ్రమలో పనిచేసే ప్యాకర్లు, చాట్వాలాలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో 61,933 మంది బీడీ కార్మికులకు పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీడీ కార్మికులకు జీవన భృతి ఇస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, కొంతమందికి మాత్రమే పరిమితమైందన్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు బీడీ కార్మికులు ఉంటే ఒక్కరికే పింఛన్ ఇవ్వడం, కటాఫ్ తేదీల పేరుతో వేలాది మంది కార్మికులను పథకానికి దూరం చేశారని విమర్శించారు.ఎన్నికల సమయంలో బీడీ కార్మికులకు పింఛన్లు అందిస్తామని, పింఛన్‌ను రూ.4,016కు పెంచుతామని హామీలు ఇచ్చినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు.ప్రభుత్వం నూతనంగా అందించ నున్న చేయూత పింఛన్లలో బీడీ కార్మికుల ప్రస్తావన లేకపోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వాల ఆంక్షలు, మరోవైపు కంపెనీల దోపిడీతో బీడీ పరిశ్రమ రోజురోజుకూ కుదేలవుతోందన్నారు. కొన్ని యాజమాన్యాలు వారంలో రెండు మూడు రోజులు మాత్రమే పని దినాలు కల్పించడంతో కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని అన్నారు.చాలీచాలని కూలీతో కుటుంబాలను పోషించుకోవడం గగనంగా మారిందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం బీడీ కార్మికులకు చేయూత పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులందరికీ పింఛన్ అందించాలని, ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రతి అర్హత కలిగిన బీడీ కార్మికురాలికి జీవన భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం ఎన్నికల సమయంలో వచ్చే నేతలు పింఛన్ ఇప్పిస్తామని హామీలు ఇవ్వడం కాకుండా, ఆ హామీలను అమలు చేయాలని అన్నారు.బీడీ కార్మికులకు నెలకు రూ.6,000 పింఛన్ ఇవ్వాలని, ప్రతి నెల 26 రోజుల పని దినాలు కల్పించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది.ఈ కార్యక్రమంలో క్లైమేంట్ వెస్లీ, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.