సూళ్లూరుపేట పట్టణంలో వేసవిలో మాయమైపోయిన చలివేంద్రాలు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పెరుగుతున్న ఎండల తీవ్రత ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ ప్రాంతాల్లో చలివేంద్రాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు డబ్బులు ఖర్చు చేసి నీళ్లు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచే ఎండలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు. బయట పనులకు వెళ్లే కార్మికులు, వ్యాపారులు, ప్రయాణికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణానికి చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలు కూడా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా గడియారం సెంటర్, కూరగాయల మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాల ఏర్పాటు అత్యవసరంగా మారింది. ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు అధికారులు, దాతలు వెంటనే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రధాన కూడళ్లలో తాగునీటి సదుపాయం కల్పించి ప్రజల దాహాన్ని తీర్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు