PS Telugu News
Epaper

రైతు భరోసా నిధులు రైతులకే… బ్యాంకుల హోల్డ్‌లతో రైతులకు ఇబ్బందులు

📅 27 Apr 2026 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

బ్యాంకుల చర్యలపై రైతుల ఆగ్రహం వెంటనే డబ్బులు విడుదల చేయాలి

సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 28మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పరిధిలోని పలు గ్రామాలలో రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం జమ చేస్తున్న రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లోకి వచ్చినప్పటికీ, బ్యాంకుల వైఖరి కారణంగా రైతులు వాటిని వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజు తెలిపారు.
సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల కోసం ప్రత్యేకంగా ఇచ్చే ఈ నిధులను బ్యాంకులు క్రాప్ లోన్ బకాయిలు, రిన్యూవల్ పేరుతో అకౌంట్లను హోల్డ్‌లో పెట్టి డబ్బులు డ్రా చేసుకునే అవకాశాన్ని నిరోధిస్తున్నాయని విమర్శించారు.రైతులకు పంటల సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్రాల అద్దెల కోసం ప్రభుత్వం ఈ నిధులను అందిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వరి కోతలు జరుగుతున్న సమయంలో రైతులకు ఈ డబ్బులు అత్యవసరంగా అవసరమై ఉన్నాయని చెప్పారు. కోత యంత్రాలు, ట్రాక్టర్లు, డీజిల్ ఖర్చులు వంటి అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవాల్సి ఉన్నా, బ్యాంకుల హోల్డ్‌ల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.“ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా నిధులు రైతుల పెట్టుబడుల కోసం మాత్రమే… అప్పులు చెల్లించడానికి కాదు. బ్యాంకులు ఈ విధంగా అకౌంట్లను హోల్డ్‌లో పెట్టడం అన్యాయం” అని గోవిందరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై రైతు సంఘాలు కూడా స్పందిస్తూ, రైతుల అకౌంట్లపై విధించిన హోల్డ్‌లను వెంటనే తొలగించి, రైతు భరోసా నిధులను పూర్తిగా విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని, లేదంటే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

Scroll to Top