తెలంగాణ

నిర్మల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి!!

నిర్మల్ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి!!

బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి!!

అడ్వకేట్ జగన్ మోహన్ బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో నిర్మల్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటిపోవడం, పంటలు ఎండిపోవడం వంటి సమస్యలతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని, రైతులు, వ్యవసాయ కూలీలు జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. నిర్మల్ జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితులను ప్రభుత్వం తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి, జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు తీసుకున్న బ్యాంకు రుణాలను పూర్తిగా మాఫీ చేసి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు తగిన పరిహారం అందించాలని కోరారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రైతుబంధు వంటి పథకాలను అమలు కొంత వరకు చేసినప్పటికీ,రైతుల రుణ సమస్యలు,పంట నష్టాలు,గిట్టుబాటు ధరలు,సాగునీటి కొరత వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందని విమర్శించారు. ముఖ్యంగా పంట రుణమాఫీని విడతలవారీగా అమలు చేయడం, రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూడాల్సి రావడం వల్ల వడ్డీ భారం పెరిగిందని పేర్కొన్నారు.అదేవిధంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు ప్రాణభయంతో, ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు అప్పటి ప్రభుత్వం వైద్య సదుపాయాలు, కరోనా పరీక్షలు, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకల లభ్యత వంటి అంశాల్లో ప్రజలకు తగిన భరోసా కల్పించలేకపోయిందనే విమర్శలు వచ్చాయని గుర్తుచేశారు. కరోనా నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని పేర్కొన్నారు.ప్రభుత్వాలు మారుతున్నా రైతుల కష్టాలు మాత్రం మారడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకే పరిమితం కాకుండా రైతాంగానికి శాశ్వత భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా తక్షణమే స్పందించి, నిర్మల్ జిల్లా రైతులను ఆదుకోవాలని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ జగన్ మోహన్ డిమాండ్ చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS