వర్ధమాన గాయని, గాయకులకు శ్రీ సరస్వతి కళా పీఠం అండ
కళాపీఠం అధినేత్రి రోజా వేణు మదిర
షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. ఖాజాపాషా (కేపి) హాజరు
( పయనించే సూర్యుడు అక్టోబర్ 28 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )వైజాగ్: విశాఖపట్నంలో నూతనంగా ప్రారంభమైన చిత్రలహరి స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమానికి విజయవాడ, హైదరాబాద్కు చెందిన శ్రీ సరస్వతి కళా పీఠం అధినేత్రి, ప్రముఖ విజిల్ సింగర్ రోజా వేణు మదిర, సంస్థ ప్రధాన సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. ఖాజాపాషా (కె.పి.) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్టూడియో అదినేత్రి నీలిమకు వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సినీ గీతాల కార్యక్రమం సంగీతాభిమానులను అలరించింది. ఈ సందర్భంగా రోజా వేణు మదిర పలు సినీ గీతాలను ఆలపించగా, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి. ఖాజాపాషా కూడా తన గానంతో ఆకట్టుకున్నారు. కళాకారుల పాటలకు కార్యక్రమానికి హాజరైన వారు విశేషంగా స్పందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని తెలుగు వర్ధమాన గాయని, గాయకులకు శ్రీ సరస్వతి కళా పీఠం తరఫున ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని రోజా వేణు మదిర, ఎం.డి. ఖాజాపాషా తెలిపారు. ప్రతిభ కలిగిన నూతన గాయని, గాయకులకు కళా పీఠం ద్వారా అవకాశాలు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.తమను చిత్రలహరి స్టూడియో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. కళాకారులు, గాయని, గాయకులు ఎక్కడ ఉన్నా వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు శ్రీ సరస్వతి కళా పీఠం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.