రాష్ట్రంలోని 9 జిల్లాల్లో పిడుగులు – ప్రజలు జాగ్రత్తగా ఉండండి
పయనించే సూర్యుడు న్యూస్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేశారు. పలు చోట్ల ఉరుములతో కూడిన మెరుపులు సంభవించే అవకాశముందని ఐఎండీ ప్రకటించింది. విపత్తుల నిర్వహణ శాఖ సమాచారం ప్రకారం.. బుధవారం కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి (శుక్రవారం) నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఏపీలో 9 జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. ఆకస్మిక వర్షాల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని స్పష్టం చేశారు. అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలో సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తేమ గాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నట్లు చెప్పారు.