తెలంగాణ

దేశ సేవే ధ్యేయంగా.. ప్రజా సంక్షేమమే సంకల్పంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవ.

దేశ సేవే ధ్యేయంగా.. ప్రజా సంక్షేమమే సంకల్పంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవ.

బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి


పయనించే సూర్యుడు అక్టోబర్ 7 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ దేశ సేవే ధ్యేయంగా, ప్రజా సంక్షేమమే సంకల్పంగా, వికసిత్‌ భారత్‌ సాధనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా సాగిస్తున్న అచంచల సేవా ప్రస్థానం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 25 సంవత్సరాలు.. 300 నెలలు.. 9,131 రోజులు.. భారతదేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలనకు అంకితమైన నిరంతర సేవకు ఈ ప్రస్థానం ప్రతీక అని పేర్కొన్నారు. వేల ఏళ్ల భారతీయ సంస్కృతి, విలువలు, మానవత్వం అందించిన స్ఫూర్తితో భారతమాతకు సేవ చేయడమే జీవిత సంకల్పంగా మోదీ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. ‘సేవా ధర్మమే మా ధర్మం’ అనే స్ఫూర్తితో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తూ, దేశ అభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతి వర్గానికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న లక్ష్యంతో ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్.. సబ్ కా ప్రయాస్’ అనే సూత్రంతో సుపరిపాలనను ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు.2047 నాటికి వికసిత్ భారత్‌ నిర్మించాలనే మహా సంకల్పంతో 140 కోట్ల మంది భారతీయుల సమష్టి కృషిని ముందుకు తీసుకెళ్తున్నారని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మించడం, ప్రపంచ అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దడం, దేశాన్ని గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడం వంటి లక్ష్యాల సాధన దిశగా దేశం వేగంగా అడుగులు వేస్తోందన్నారు. కులాలు, వర్గాల పేరుతో ప్రజలను విభజించడం కాకుండా ప్రతి రైతు, ప్రతి కుటుంబం, ప్రతి భారతీయుడి అభివృద్ధే లక్ష్యంగా మోదీ పనిచేశారని తెలిపారు. ప్రతి రైతు అభివృద్ధి చెందాలి.. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి.. ప్రతి యువతకు అవకాశాలు లభించాలి.. ప్రతి మహిళ సాధికారత సాధించాలి.. ప్రతి భారతీయుడు గర్వంగా తాను భారతీయుడినని చెప్పుకునే స్థాయికి దేశం ఎదగాలి అన్నదే మోదీ ఆలోచనా విధానమని డాక్టర్‌ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.. దేశాన్ని అభివృద్ధి చెందిన, ఆత్మనిర్భర, శక్తిమంతమైన భారత్‌గా తీర్చిదిద్దే ఈ మహాయజ్ఞంలో మోదీకి తోడుగా ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS