పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా: జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల, భైంసాలో ముందస్తు బతుకమ్మ సంబరాలు గురువారం ఘనంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిను లు సంప్రదాయ దుస్తుల్లో, రంగురంగుల పూలతో బతుకమ్మల ను అందంగా అలంకరించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల ను ప్రతిబింబించేలా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని మహిళా సాధికారత విభాగం, సాంస్కృతిక మరియు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. మహిళా సాధికారిక అధిపతి డాక్టర్ కల్పన, దివ్య కల్చరల్ కోఆర్డినేటర్ ఏ. రాజు, (ఎన్ ఎస్ ఎస్) నిర్మల్ జిల్లా కన్వీనర్ డాక్టర్ జె. ఓంప్రకాశ్, నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత భైంసా మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీ తూమొల్ల దత్తాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని వివరించారు. బతుకమ్మను ఎలా జరుపుకోవాలి, పూల ప్రాధాన్యత ఏమిటి అనే విషయాలను విద్యార్థులకు వివరించారు. పండుగలోని మంచిని స్వీకరిస్తూ, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కౌన్సిలర్ రాధిక, తాలోడ్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని, విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొని కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.కళాశాల ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ నాగేష్, జనరల్ సెక్రటరీ మనోజ్ పాపిన్వార్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థినులు సంప్రదాయ బతుకమ్మలను అలంకరించి, వాటి చుట్టూ చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు. కళాశాల ప్రాంగణం తెలంగాణ పూల పరిమళంతో, బతుకమ్మ పాటలతో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.కార్యక్రమంలో కళాశాల సీనియర్ అధ్యాపకులు డాక్టర్ కె. రఘునాథ్, డాక్టర్ భీమారావు, డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ యు. రవికుమార్, డాక్టర్ శంకర్, డాక్టర్ సంతోష్, డాక్టర్ సుధాకర్ , డా.నహేదా, తదితర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని, బతుకమ్మ వేడుకల ద్వారా సాంస్కృతిక విలువలు, ప్రకృతి పరిరక్షణ, మహిళా సాధికారత సందేశాన్ని సమాజానికి చాటిచెప్పాలని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.
