జీవో 641 రద్దు చేసే వరకు డంపింగ్ యార్డ్ వ్యతిరేక ఉద్యమం ఆగదు

July 3, 2026 | తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్‌పై బీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభం

( పయనించే సూర్యుడు జులై 04 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )సిద్దాపూర్ గ్రామంలో జీహెచ్‌ఎంసీ ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం (డంపింగ్ యార్డ్) ఏర్పాటు కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నం. 641పై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించేందుకు ఈరోజు షాద్‌నగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సిద్దాపూర్, పరిసర గ్రామాల నాయకులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో సిద్దాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, భూగర్భ జలాలు తీవ్రంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం జీవో నం. 641ను జారీ చేయడం ప్రజావ్యతిరేక నిర్ణయమని విమర్శించారు. డంపింగ్ యార్డ్ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, జీవో 641 ఉప సంహరించు కునే వరకు ప్రజలతో కలిసి అన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. గ్రామాల వారీగా ప్రజలను చైతన్యపరుస్తూ, అవసరమైతే భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సిద్దాపూర్ ప్రజల న్యాయమైన పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని, ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మాజీ జడ్పీటీసీ శ్రీలత సత్యనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు మెండే కృష్ణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, సర్పంచ్ వెంకటయ్య, మాజీ సర్పంచులు వడ్డె బాలయ్య, రమేష్, చంద్రశేఖర్ తదితరులు, ఆయా గ్రామాల, తండాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper