
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : ఎల్ నీనొ ప్రభావం వల్ల యాసంగి పంటల సాగుపై ఎదురయ్యే వాతావరణ మార్పులు, వాటి ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామంలో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ ప్రజలకు, రైతులకు అవగాహన కల్పించారు. రైతులకు యాసంగి పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నీటి వినియోగం, పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, సాగునీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపట్టాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సాగు చేయాలని రైతులకు సూచించారు. వాతావరణ మార్పుల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. ఈ అవగాహన సదస్సులో గ్రామ సర్పంచ్ కుర్లెపు గంగాధర్, ఉపసర్పంచ్ రేపల్లి సాయిప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.