ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన బీఆర్‌ఎస్ యువజన నాయకుడు పవన్ కల్యాణ్
( పయనించే సూర్యుడు అక్టోబర్ 29 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )కొందుర్గు మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్‌ఎస్ గంగన్నగూడ యూత్ ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక అన్నదాతలు అప్పులపాలవుతున్నారని పేర్కొన్నారు. మండలంలోని రైతులకు జరిగిన పంట నష్టంపై ప్రత్యేక అధికారుల బృందంతో సమగ్ర సర్వే నిర్వహించి నివేదిక రూపొందించాలని కోరారు. అర్హులైన రైతులకు ఎకరాకు తగిన కరువు పరిహారం అందించాలని, నిలిచిపోయిన రూ.2 లక్షల రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ అందక రైతులు కొత్త రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ యువజన విభాగం తరఫున పోరాటం కొనసాగిస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.