పయనించే సూర్యుడుD.26.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్. స్మార్ట్ఫోన్లను దూరం పెట్టి.. క్రీడా మైదానాల వైపు విద్యార్థులను నడిపించండిపాఠశాల భవనాలు, మౌలిక వసతుల బిల్లులను తక్షణమే విడుదల చేయాలి…ప్రభుత్వానికి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ పెండింగ్ బిల్లుల విడుదల కోసం అసెంబ్లీలో మరోసారి గళమెత్తుతాం క్రీడల నిర్వహణలో పీఈటీల అంకితభావం అభినందనీయం బాల్కొండ నియోజకవర్గంలో క్రీడారంగ వికాసానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు దాతల సహకారంతో కృషి చేస్తా మెండోరా మండల 70వ SGF అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను ప్రారంభించిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోచంపాడ్ (SRSP)(మెండోరా):విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను తమ జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని, బాల్కొండ శాసనసభ్యులు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పోచంపాడ్ ఎస్సారెస్పీ (SRSP) ప్రాంగణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెండోరా మండల స్థాయి 70 వ అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను (అండర్-14, అండర్-17 విభాగాల్లో) సోమవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ను తిలకించి, విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభ సభలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో మెండోరా మండల పరిధిలోని పాఠశాలలకు మంజూరైన నూతన భవనాలు, అదనపు గదుల నిర్మాణ పనులు నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ‘మన ఊరు – మన బడి’ పథకం కింద వివిధ పాఠశాలల్లో చేపట్టిన కిచెన్ షెడ్లు, ప్రహరీ గోడలు, టాయిలెట్ల నిర్మాణాలకు సైతం చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ పనులను మధ్యలోనే వదిలివేసే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయమై తాను ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయడం తో పాటు ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. నియోజక వర్గంలోని పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలు, మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని మరోమారు ఆర్థిక శాఖ మంత్రిని స్వయంగా కలిసి ఒత్తిడి తెస్తానని స్పష్టం చేశారు.
మండల విద్యాశాఖ అధికారి (MEO) కోరిన మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యూయల్ డెస్క్ బల్లల కొరతను తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ కుటుంబ వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త దయానందరెడ్డి ఇప్పటికే పలు ప్రభుత్వ పాఠశాలలకు స్వచ్ఛందంగా డ్యూయల్ డెస్కులు, కంప్యూటర్లు సమకూర్చి విద్యార్థుల విద్యకు అండగా నిలిచారని ప్రస్తావించారు. అలాగే చాకిర్యాల్ పాఠశాలలో అవసరమైన వసతుల కోసం స్థానిక సర్పంచ్ చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ.. గ్రామ వీడీసీ (VDC) సభ్యులు, ప్రధానోపాధ్యాయులు అవసరమైన వివరాలతో వేల్పూరులోని క్యాంప్ కార్యాలయంలో తనను సంప్రదిస్తే దయానందరెడ్డి సహకారంతో తగిన వసతులు సమకూర్చేలా చూస్తానని హామీ ఇచ్చారు.
నేటి సాంకేతిక యుగంలో విద్యార్థులు టీవీలు, స్మార్ట్ఫోన్ల స్క్రీన్లకు బానిసలై మైదానాలకు దూరమవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులను ఫోన్లకు దూరంగా ఉంచి, ప్రతిరోజూ సాయంత్రం కనీసం గంటపాటు మైదానంలో ఏదో ఒక ఆట ఆడేలా తల్లిదండ్రులు బాధ్యతగా ప్రోత్సహించాలని కోరారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆటల ద్వారానే జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, వైఫల్యాలను తట్టుకునే మానసిక స్థైర్యం (స్పోర్ట్స్‌మ్యాన్ స్పిరిట్) అలవడుతుందని, విద్యార్థులు ఎలాంటి నిరాశ, డిప్రెషన్లకు గురికాకుండా స్థిరచిత్తంతో ముందుకు సాగడానికి క్రీడలు దోహదపడతాయని హితవు పలికారు. తనది మొదటినుంచీ క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబమని, తన తండ్రి నేషనల్, యూనివర్సిటీ వాలీబాల్ క్రీడాకారుడని, తాను కూడా జూనియర్ నేషనల్ వాలీబాల్ క్రీడాకారుడినని, తన సోదరుడు యూనివర్సిటీ క్రికెట్ క్రీడాకారుడిగా, సోదరి స్టేట్ ఖో-ఖో ప్లేయర్‌గా రాణించారని గుర్తుచేసుకున్నారు. క్రీడలంటే ఉన్న అమితమైన మక్కువతోనే తాను ఎంతటి తీరికలేని పనుల్లో ఉన్నా క్రీడా కార్యక్రమాలకు తప్పక హాజరవుతానని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గాన్ని క్రీడారంగంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు, దాతల సహకారంతో సంపూర్ణంగా సహాయసహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో అధికారం చేపట్టిన తర్వాత క్రీడాకారులకు, క్రీడారంగానికి మరింత ఉన్నతమైన ప్రాధాన్యత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.మండల స్థాయి అంతర్ పాఠశాలల క్రీడోత్సవాలను సొంత ఇంటి పనుల్లా బాధ్యతగా భావించి సమర్థవంతంగా నిర్వహిస్తున్న మండల పీఈటీలు విద్యాసాగర్, రాజ్‌కుమార్, గంగాధర్, రమేష్, శ్రీనివాస్, ప్రభాకర్‌ల అంకితభావాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందించారు. అలాగే కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన పోచంపాడ్ జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు ధర్మపురి, ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్ మాధురి రాజు, స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ధర్మపురి, పోచంపాడ్ సర్పంచ్ మాధురి రాజు, డీసీసీబీ డైరెక్టర్ మెండోరా మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి,ఎంఈవో శ్రీనివాస్, ఎంపీడీవో లక్ష్మణ్, మండల పరిధిలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు), ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.