పయనించే సూర్యుడుD.10.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాతో పాటు చట్టపరమైన చర్యలు: మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ భీంగల్ పట్టణంలోని కుప్కల్ రోడ్డులో రోడ్డుకు ఇరువైపులా పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు మరియు వ్యర్థాలను మున్సిపల్ సిబ్బంది జేసీబీ సహాయంతో తొలగించారు. పట్టణంలో పరిశుభ్రతను కాపాడటంతో పాటు ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ మాట్లాడుతూ కుప్కల్ రోడ్డుతో పాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో ఎవరూ రోడ్ల పక్కన చెత్తాచెదారం వేయకూడదని సూచించారు. ముఖ్యంగా వ్యాపారస్తులు తమ దుకాణాల నుంచి వెలువడే చెత్తను రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ వాహనాలకు అందించాలన్నారు నిబంధనలు ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే మున్సిపల్ చట్టం-2019 ప్రకారం జరిమానా విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్య కరంగా ఉంచడం కేవలం మున్సిపాలిటీ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజలు, వ్యాపారస్తులు మున్సిపాలిటీకి సహకరించి భీంగల్ పట్టణాన్ని పరిశుభ్రమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు భాగస్వాములు కావాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.