పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి విద్య ఒక్కటే సమాజాన్ని సమూలంగా మార్చగలిగే శక్తివంతమైన సాధనమని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అర్హత సాధించిన రౌలకోల వంశీకి ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం కూకట్పల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బండి రమేష్ విద్యార్థికి మంజూరైన నిధులకు సంబంధించిన పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా వ్యక్తిగత జీవితంలోనే కాకుండా సమాజాభివృద్ధిలోనూ కీలక మార్పులు తీసుకురావచ్చని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రతిభావంతులైన విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రభుత్వ సహకారంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడంతోపాటు, తమ మాతృభూమికి తిరిగి వచ్చి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తాము సంపాదించిన జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం వినియోగించాలని విద్యార్థికి సూచించారు.విద్యార్థి వంశీకి భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని బండి రమేష్ ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పుష్ప రెడ్డి, నాగార్జున, శ్రీనివాస్ బాబు, మస్తాన్ రెడ్డి, క్రాంతి, లక్ష్మయ్య, బాలరాజు, రమణ, ఆసిఫ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.