అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ ఆవిష్కరణ మంత్రి నిమ్మల రామానాయుడు, విప్ దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా ఆవిష్కరణ
పయనించే సూర్యుడు జూలై 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పశువుల్లంక గ్రామం సమీపంలోని ఆక్విడెక్ట్ వద్ద అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథులుగా హాజరై సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ గోదావరి జలాలను సద్వినియోగం చేస్తూ ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహ నీయుడని కొనియాడారు. రైతాంగ సంక్షేమే లక్ష్యంగా ఆనకట్టలు, కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని అన్నారు.సర్ ఆర్థర్ కాటన్ దూరదృష్టి, సేవా భావం వల్లే నేడు గోదావరి డెల్టా ప్రాంతం దేశంలోనే అత్యంత సస్యశ్యామల ప్రాంతాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. రైతుల పట్ల ఆయనకున్న అంకితభావం, చేసిన సేవలకు గుర్తింపుగానే ప్రజలు ఆయనను “అపర భగీరథుడు”గా గౌరవిస్తున్నారని తెలిపారు. ఇటువంటి మహనీయుని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా భావితరాలకు ఆయన సేవలను తెలియజేసే అవకాశం కలుగుతుందని అన్నారు.రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన సర్ ఆర్థర్ కాటన్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. గోదావరి జలాలను వ్యవసాయానికి మళ్లించి లక్షలాది రైతు కుటుంబాలకు శాశ్వత జీవనాధారం కల్పించిన మహనీయుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు.అదేవిధంగా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారం, సాగునీటి అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎమ్మెల్యే నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నారని తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా నియోజకవర్గ పురోగతి కోసం అంకితభావంతో కృషి చేస్తున్న దాట్ల సుబ్బరాజు వంటి ప్రజానాయకుడిని ప్రజలు ఎప్పటికీ వదులుకోకూడదని సభాముఖంగా కొనియాడారు.ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాతలు ధూళిపూడి కృష్ణ, లక్ష్మీ దంపతులను మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సమాజానికి స్ఫూర్తిగా నిలిచే ఈ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దూళిపూడి చక్రం జి జమ్మి కాకర్లపూడి రాజేష్ విజయకుమార్ సీనియర్ నాయకులు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, గ్రామ పెద్దలు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.