ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న ను మర్యాదపూర్వకంగా కలిసిన మహిళా సర్పంచులు
తమ గ్రామాల సమస్యలపై చర్చ
( పయనించే సూర్యుడు జూలై 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న ను నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల సర్పంచులు వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.ఈ సమావేశంలో సర్పంచులు తమ తమ గ్రామాల్లో ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలను ఎమ్మెల్యే శంకరన్న దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థల ఆధునీకీకరణ మరియు గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ నిధుల విడుదల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేయించాలని వారు ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేశారు. సర్పంచులు వివరించిన సమస్యలపై ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరన్న సానుకూలంగా స్పందించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని సర్పంచులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎలికట్ట గ్రామ సర్పంచ్ వాకిటి నవకిరణి , దేవునిపల్లి సర్పంచ్ లలిత, అన్నారం సర్పంచ్ లావణ్య, రామేశ్వరం సర్పంచ్ మానస పాల్గొన్నారు.